Friday, September 13, 2013

దొంగకు రామలింగడు చేసిన మోసం

తెనాలి రామలింగడి ఊళ్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజూ ఎవరో ఒకరి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు.

ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి, దాన్ని గూట్లో పెట్టి, ఏమేం చేయాలో అన్ని భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగ్గా ఆ రోజు రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి జొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు...

"ఏమేవ్...! మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చి ఇచ్చాడు గదా... అది ఎక్కడ పెట్టావు" అని అన్నాడు. దీనికి ఆమె "ఏదీ ఆ వజ్రాల ఉంగరమేనా..? అయ్యో నా మతిమండా, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండీ.. దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చేపోయాను" అంది.

"ఎంతపని చేశావే. అదసలే లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం. అది కాస్తా ఏ దొంగో ఎత్తుకుపోయాడంటే మన గతేంకాను" అన్నాడు రామలింగడు. "ఏమీకాదుగానీ పడుకోండి. పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా..!" అంది భార్య. అంతే అంతటితో వాళ్లు నిద్రపోయినట్లుగా నటిస్తూ పడుకుండిపోయారు.

జరిగిందంతా విన్న దొంగ.. రామలింగడి దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవడం గమనించి మెల్లిగా గూట్లో చెయ్యిపెట్టి అగ్గిపెట్టె అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది. తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిలాడిపోయాడు. అయినా కూడా చప్పుడు చేస్తే.. నలుగురూ వచ్చి తనను పట్టుకుంటారన్న భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు.

ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగడి దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగడు తన భార్యతో... "మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్లుంది పాపం" అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగడు చేసిన మోసం తెలిసిపోయి.. ఇంకెప్పుడూ అతడింటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు.

తెనాలి రామలింగడి కథలు- చైనా చక్రవర్తి

ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.


పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. 

అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు. నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. 

మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ, ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. మృత్యువును జయం చేసే మహిమ ఆ పండ్లకు లేవని అర్థం చేసుకున్నాక , అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయల అనుమతి మేరకు సభలోని వారందరూ ఆరగించారు.

మర్యాదరామన్న కథలు


సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు - ఆ గొర్రెల కాపరి దంపతులకు, రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదు. చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడవికి పంపితే, అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి "నీ మొహం చూపించ వద్ద" ని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. "అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది" అని, వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచీ రామన్న కాస్తా మర్యాద రామన్నగా అందరి మన్ననలూ అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మ బద్ధమైన న్యాయవేత్తగా - తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు, నలుగురు దొంగలతో తగువొచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం, వాళ్ళెప్పుడో అమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలూ, నలుగురూ కలిసి అడగ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూండగా, వాళ్ళని చూపిస్తూ నలుగో దొంగ, పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటునుంచి అటే ఉడాయించాడు.

ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, "ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే" అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమనీ కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

శేషయ్య అనే రైతు, పెళ్ళి వేడుకల కోసం, ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాన అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదు ఇస్తానంటే, ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్, మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకు రమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంట్లో, తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలాయి. తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికీ, పగిలిన ఈ కుండలకీ చెల్లు! ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న.

రంగమ్మకీ, గంగమ్మకీ వీశెడు నెయ్యి బాకీ దగ్గర తగువొచ్చింది. రెండు గేదెల పాడి వున్న రంగమ్మ దగ్గర, ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా, ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, "అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?" అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. "ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?" అడిగాడు పేరయ్య.

"పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది" అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు పెట్టుకుంటూ, అందరితోనూ "ధర్మప్రభువు మర్యాద రామన్న" అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు

పొడుపు కథలు -1

1)మిమ్మల్ని ఎండ నుంచి వాన నుంచి రక్షించ లేని గోడుగుని
ఎవరు నేను ?
జవాబు : గుడుగో ట్టపు
2)రెండు అంగుళాల గదిలోఅరవై మంది దొంగలుతల,మొండం ఉన్నాయి కానీ కాళ్ళు,చేతులు లేవు ఎవరు వాళ్ళు ?
జవాబు : లుల్లపు లోట్టే పెగ్గి
3)అడ్డంగా కొస్తే చక్రాన్నవుతా నిలువుగా కొస్తే శంఖాన్నవుతా ఎలా కోసినా నిన్నేడిపిస్తా ఎవరు నేను
జవాబు: యపాల్లి
4)తల ఒకటే కాని చేతులు మూడుంటాయి నేనెవరో చెప్పు కొండి?
జవాబు: ముర యాడి
5)
నాట్యం చేస్తాను కానీ
నాట్య కత్తెను కాను
ఒళ్లంతా కళ్ళే కాని
రెండింటి తోనే చూస్తాను
నా పేరేంటి?
జవాబు :లిమనే
6)
దేహమంత కళ్ళు కానీ
దేవేంద్రుడుని కాను
నరుడి సాయం లేక పొతే
ఎటూ నడవ లేను
ఎవరు నేను?

జవాబు: లవ


7)


ఒళ్ళు వేడెక్కితే
గటగట నీళ్ళు తాగేస్తాను
కాస్త చల్ల బడితే చాలు
గొల్లున ఏడ్చేస్తాను
ఇంతకీ నేనెవరు?

జవాబు: బ్బు

చదువు-సంస్కారం

రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకొనేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు; అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవాళ్ళు. రామయ్య తనవంతుగా అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు.
రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేశ భట్టు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆటపట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య, ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి, కారణం అడిగాడు. “నేను చదువుకోను సార్!” అన్నాడు తప్పిస్తే, సిద్ధయ్య భట్టుపై ఎలాంటి ఫిర్యాదూ చెయ్యలేదు.
ఇక చేసేదేమీ లేక, సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్ళేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో “నీకు చదువు రాలేదని బాధ పడకు. చదువు రాకున్నా పరవాలేదు-చదివే వాళ్ళను గౌరవించు. నీ‌ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో” అని చెప్పాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత, సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో‌ మెళకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నిటినీ తన పొలంలో అమలుపరచి, బంగారం‌ పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకొని, ఊళ్ళో వాళ్లందరిచేతా ‘శభాష్’ అనిపించుకున్నాడు. చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రతించేవాళ్ళు.
ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో‌ ప్రవచనాలు ఇస్తున్నాడనీ, చక్కగా మాట్లాడతాడనీ విని, సిద్ధయ్య వెళ్ళి, ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్ళేసరికి, ఆయన వేరెవరో కాదు- చిన్ననాడు బడిలో‌తనని ఆట పట్టించిన గణేశభట్టు! సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి, భట్టుకు ఆశ్చర్యం వేసింది. ఊళ్ళోవాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసిన భట్టుకు తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది.
“నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్నీ‌ , నీలో ఉన్న మంచితనాన్నీ గమనించని నన్ను క్షమించు సిద్ధయ్యా!” అన్నాడు అతను నీళ్ళు నిండిన కళ్ళతో.
“అలా అనకు మిత్రమా, పాండిత్యం‌ పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం, కాదూ?” అన్నాడు సిద్ధయ్య, అణకువతో.
"మంచితనాన్ని మించిన చదువు లేదు".

మంచితనం



 సీతాపురం అనే గ్రామంలో రాము, సోము అనే అన్నదమ్ములు ఇద్దరు ఉండేవాళ్లు. వాళ్ళ తండ్రి చనిపోతూ-చనిపోతూ “మీరిద్దరూ పొలాల్ని,ఇండ్లను సమానంగా పంచుకోండి” అని చెప్పి చనిపోయాడు.
రాముకు కొంచెం గడుసుతనం ఎక్కువ. సోము అమాయకుడు. ఎలాగైనా సోమూని మోసం చేయాలనుకున్నాడు రాము. అందుకని పంపకాల సమయంలో సోముకి చౌడు నేల ఇచ్చి, రాము మాత్రం ఎర్రనేలను తీసుకున్నాడు. సోము ఆ చవుడు నేలనే దుక్కి చేద్దామనుకొని పని ప్రారంభించగానే, పొలంలో ఒక చోట నాగలి విరిగిపోయింది. ‘ఏమిటా’ అని త్రవ్వి చూస్తే , అక్కడ తాతల నాటి లంకె బిందెలు దొరికాయి! రాముకు ఆ విషయం తెలిసి, వాటిలో తనకూ వాటా కావాలని పోరు పెట్టాడు. అమాయకుడైన సోము “దానిదేముంది అన్నా, ఈ సంపద నీది మాత్రం కాదా?” అని, వాటిలో సగం పంచి ఇచ్చాడు.
అయినా రాముకు ఆశ చావలేదు. తమ్ముడు పొలంలో బోరు వేసి, పంట వేయగానే, ఆ బోరు ప్రక్కనే తను ఇంకొక బోరు వేయటం మొదలు పెట్టాడు. ‘కొంచెం దూరంగా వేయరాదా అన్నా?’ అని తమ్ముడు అడిగితే, “నీ బోరుకేమీ అవ్వదులే” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అయితే, ముప్ఫై వేల రూపాయలు ఖర్చు పెట్టినా, ఆ బోరులో‌ నీళ్ళు పడలేదు. తమ్ముడిని చెడపాలనుకున్న రాము తేలు కుట్టిన దొంగ చందాన, కిక్కురు మనలేదు.
ఆపైన ఇద్దరూ పొలంలో పంట వేశారు. రాము పొలంలో పంట చాలా‌ బాగా వచ్చింది. అయినా అతను ఆ దిగుబడిని సోము ఫలసాయంతో‌ పోల్చుకొని కుమిలి పోయాడు. ఇద్దరూ పంటను కోసి వాములు వేశారు. ఆ సమయంలో రాము ఎలాగైనా తమ్ముడి పంటకు నిప్పు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఒకనాటి అర్ధరాత్రి సోము లాంతరు చేతిలో పట్టుకొని తమ్ముడి వాము దగ్గరికి పోయాడు. దానికి నిప్పు పెట్టాలనుకునే సరికి, అక్కడ కాపలాగా ఉంచిన కుక్క మొరగటం మొదలు పెట్టింది. “ఎవరదీ?” అని సోము లేచి వచ్చాడు. దాంతో‌ రాము గబుక్కున తన చేతిలోని లాంతరును ఆపేసి, పరుగున అక్కడే ఉన్న ఒక పొద చాటున దాక్కున్నాడు. అయితే అతని ఖర్మేమో అన్నట్లు, అక్కడే ఉన్న పాము అతన్ని కరిచింది. ప్రాణాలు కడబట్టి పడిపోయి, నురగలు కక్కుతున్న అన్నను తమ్ముడే ఎత్తుకొని, వైద్యుని దగ్గరికి పరుగు తీశాడు. అయితేనేమి? బాగయ్యేటప్పటికి రాముకు వెయ్యిరూపాయలు ఖర్చయ్యాయి!
అయినా రాముకు తమ్ముడి మీద అసూయ తగ్గలేదు. తనకు అడ్డుగా నిలిచిన కుక్కను ఎలాగైనా చంపాలనుకున్నాడు వాడు. ఒకరోజు ఉదయం సోము కట్టెలకోసం అడవికి పోయినప్పుడు, రాము అన్నంలోకి పురు గులమందు కలిపి, కుక్క ముందు ఉంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ వాసనను గ్రహించిన కుక్క, దాన్ని తినక, దాన్ని తన్ని క్రింద పడేసింది. రాముకి కోళ్ళు చాలా ఉన్నాయి. అవి గింజలు వెతుక్కుంటూ వచ్చి, కుక్క వదిలేసిన అన్నం మెతుకులను తిన్నాయి. దాంతో, సాయంత్రానికి ఆ కోళ్ళన్నీ చనిపోయాయి. “కుక్క చనిపోయి ఉంటుంది” అని సంతోషపడ్డ రాముకు, తన కోళ్లన్నీ చనిపోయాయన్న వార్త తెలిసి, గుండె ఆగినంత పనైంది.
“ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు-ఇతరుల చెడును ఆశించకూడదు”అని ఆలస్యంగానైనా సరే, తెలుకున్నాడు రాము. తమ్ముడి దగ్గరకు వెళ్ళి తన తప్పులన్నీ ఒప్పుకొని క్షమాపణ కోరాడు. “అవేమీ మనసులో పెట్టుకోకు అన్నా! మనం‌ఇద్దరం ఒకటే అనుకో” అని తమ్ముడు తన మంచినే పంచాడు. తమ్ముని వ్యక్తిత్వంలో గొప్పదనాన్ని గుర్తించిన రాము, ఆ నాటినుండి సోము బాటలో నడిచాడు.

Thursday, August 29, 2013

ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రం యొక్క అధికారిక గీతం మా తెలుగు తల్లి

మా తెలుగు తల్లి గీతం

ఆంధ్రప్రదేశ్ అధికారిక గీతం  - మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లి గీత రచయిత  - శంకరంబాడి సుందరాచారి

 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!